తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న డీఎంకే కాంగ్రెస్ బంధానికి తెరపడింది. కాంగ్రెస్‌తో పొత్తు ముగిసినట్లు డీఎంకే అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా, ఇండియా కూటమి నుంచి కూడా తాము వైదొలుగుతున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాల్లో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను అందుకోలేకపోయింది. డీఎంకే కూటమిలో ఉండి 5 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, అనూహ్యంగా టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం డీఎంకే అధినాయకత్వానికి తీవ్ర ఆగ్రహం కలిగించింది.
తమ కూటమి అండతో ఎన్నికల్లో గెలిచి, ఫలితాలు రాగానే టీవీకేకు మద్దతు ఇవ్వడంపై డీఎంకే నేతలు నిప్పులు చెరుగుతున్నారు. మా అండతో గెలిచి, మాకే వెన్నుపోటు పొడిచారు అంటూ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నమ్మకద్రోహం వల్లే పొత్తును రద్దు చేసుకుంటున్నామని, ఇకపై కాంగ్రెస్‌తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని డీఎంకే స్పష్టం చేసింది.


