పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన భారతీయ జనతా పార్టీ, ముఖ్యమంత్రి ఎంపికపై నెలకొన్న సస్పెన్స్‌కు ఎండ్ కార్డ్ వేసింది. బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను మట్టికరిపించి, రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడంలో కీలక పాత్ర పోషించిన సువేందుకే అధిష్టానం పట్టాభిషేకం చేయాలని నిర్ణయించింది. కోల్‌కతాలో జరిగిన బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య, సువేందు అధికారి పేరును ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు మెజారిటీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. దీంతో మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా ఉండి, ఆ తర్వాత ఆమెనే ఎదురించి ఓడించిన సువేందు, ఇప్పుడు బెంగాల్ గడ్డపై తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించబోతున్నారు.
ఇప్పటికే నిర్ణయించిన ప్రకారం, మే 9న కోల్‌కతాలోని ఐకానిక్ బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో సువేందు అధికారి ప్రమాణ స్వీకార మహోత్సవం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.


