జమ్ముకశ్మీర్‌లో అధికారంలో ఉన్న జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (జేకేఎన్‌సీ)లో చీలిక ఊహాగానాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. తమ పార్టీలో ఎక్‌నాథ్ షిండేలు ఎవరూ లేరని అన్నారు. ఫిరాయింపులు జరుగవచ్చన్న బీజేపీ వాదనలను ఆయన తోసిపుచ్చారు. జేకేఎన్‌సీలో అంతర్గత సంక్షోభం ఉన్నదని బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ ఆరోపించారు. ఆ పార్టీ నుంచి విడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఏక్‌నాథ్ షిండేలు చాలా మంది ఉన్నారని ఆయన తెలిపారు. పార్టీలో నెలకొన్న అసమ్మతి భయంతోనే సీఎం తన మంత్రివర్గాన్ని విస్తరించలేకపోతున్నారని విమర్శించారు. ఒమర్ అబ్దుల్లా తన మంత్రివర్గాన్ని విస్తరించిన వెంటనే జేకేఎన్‌సీ పేక ముక్కలా కూలిపోతుంది అని వ్యాఖ్యానించారు.
కాగా, బీజేపీకి చెందిన ప్రతిపక్ష నేత సునీల్ శర్మ వ్యాఖ్యలను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. జేకేఎన్‌సీలో ఫిరాయింపులు జరుగవచ్చని బీజేపీ చేస్తున్న వాదనలు వారి అసలు ఉద్దేశాలను బయటపెడుతున్నాయని విమర్శించారు. జేకేఎన్‌సీ ఎమ్మెల్యేలు పార్టీతోనే దృఢంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే కూడా తిరుగుబాటు చేసి బీజేపీలో చేరబోరని ఆయన అన్నారు.


