ప్రపంచ సినీ, ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షించే ప్రతిష్ఠాత్మక వేడుక కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అందరి మనసులు దోచుకున్నారు. ఫ్రెంచ్ రివియేరాలో ఉదయం కలల ప్రపంచాన్ని తలపించేలా కనిపించిన అలియా, సాయంత్రం రెడ్ కార్పెట్‌పై మరింత గ్లామరస్‌గా మెరిసి అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. లొరియల్ పారిస్ బ్రాండ్ అంబాసిడర్‌గా కేన్స్ రెడ్ కార్పెట్‌పై అడుగుపెట్టిన అలియా, ప్రముఖ డిజైనర్ తమరా రాల్ఫ్ రూపొందించిన ప్రత్యేక గౌన్‌లో కనిపించారు. బ్లష్ పింక్ షేడ్‌లో రూపొందిన ఈ స్ట్రాప్‌లెస్ గౌన్ ఆమెకు అద్భుతమైన ఎలిగెన్స్‌ను తీసుకొచ్చింది.
ఈ గౌన్‌లో కర్వ్డ్ బస్టియర్ నెక్‌లైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే కార్సెట్ స్టైల్ బాడిస్ ఆమె ఫిట్‌నెస్‌ను మరింత హైలైట్ చేసింది. ఇక గౌన్‌కు జతగా చేతుల చుట్టూ వేసుకున్న దుపట్టా తరహా డ్రేప్ మొత్తం లుక్‌కు ఇండియన్ టచ్‌ను తీసుకొచ్చింది. పాశ్చాత్య ఫ్యాషన్‌లో భారతీయ శైలిని మిళితం చేసిన ఈ డిజైన్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంది. అలియా మినిమల్ జువెలరీ, సాఫ్ట్ మేకప్, సింపుల్ హెయిర్ స్టైల్‌తో రెడ్ కార్పెట్‌పై రాయల్ లుక్‌లో కనిపించారు. ఆమె చిరునవ్వు, ఆత్మవిశ్వాసం ఈ లుక్‌ను మరింత ప్రత్యేకంగా మార్చాయి.


