కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. తనపై మీడియా, సోషల్ మీడియా, యూట్యూబ్‌లో పరువు నష్టం కలిగించేలా వార్తలు ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కుమారుడు భగీరథ్ పోక్సో కేసుతో పాటు తనపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో తన పేరు, ఫొటోలు, వీడియోలు వాడొద్దంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరుతో ఇప్పటివరకు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్లలో ఉన్న వీడియోలను తొలగించాలని కోర్టును బండి సంజయ్ కోరారు.
తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని న్యాయస్థానానికి బండి సంజయ్ వివరించారు. ఈ క్రమంలో సోషల్ మీడియా, యూట్యూబ్, మీడియాలో బండి సంజయ్‌పై వచ్చిన కథనాలను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది. తదుపరి ఆదేశాల వరకు ఎలాంటి కథనాలు ప్రసారం చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. యూట్యూబ్, సోషల్ మీడియాలో బండి సంజయ్‌కి వ్యతిరేకంగా ఉన్న పోస్టులను వెంటనే తొలగించాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశించింది.


