స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర ఎంతో ముఖ్యమైందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కష్టాలు అన్నింటినీ అధిగమిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల భూముల జోలికి రాకుండా టెక్నాలజీ వాడుతున్నామని, స్వచ్ఛాంధ్ర అంటే చెత్తను శుభ్రం చేయడమే కాదని ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో జనాభా తగ్గుదల సమస్యగా మారిందని, పిల్లలు భారం కాదని వాళ్లే మన సంపదని తెలియజేశారు. మూడో బిడ్డను పుట్టిన వెంటనే రూ. 30 వేలు ఇస్తామని, నాలుగో బిడ్డ పుట్టిన వెంటనే రూ.40 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. భూతగాదాలు లేకుండా చేసే బాధ్యత తమ ప్రభుత్వానిదని, తలసరి ఆదాయం పెంచాలన్నదే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విధ్వంసం చేయడం క్షణం పని అని దాన్ని బాగుచేయాలంటే చాలా సమయం పడుతుందని అన్నారు. తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తున్నామని, భగవంతుడు కరుణిస్తే తల్లికి వందనం కింద ఇచ్చే మొత్తాన్ని పెంచుతామని అన్నారు. పేదరికం లేని సమాజం చూడాలనేదే తన ఆకాంక్షని, సంపద పెంచి పేదలకు పంచాలని అన్నారు. త్వరలో పైప్ ద్వారా గ్యాస్ తీసుకొస్తామని స్పష్టం చేశారు.


