ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా మే 22న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరుగనుంది. ఉప్పల్ వేదికగా జరిగే చివరి మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. దీన్ని సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకొనే అవకాశం ఉందని సిపి సజ్జనార్ ఫ్యాన్స్‌ని హెచ్చరించారు. ఐపిఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తాయని సజ్జనార్ తెలిపారు.
అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారు. ఫేక్ యాప్స్‌తో తస్మాత్ జాగ్రత్త. మ్యాచ్ చూడాలనే ఉత్సాహంతో సోషల్‌మీడియాలో వచ్చే అనధికార లింకులను నమ్మి మోసపోవద్దు. ఇలాంటి ఫేక్ యాప్స్, వెబ్‌సైట్లపై నిఘా ఉంచాం. ఎవరికైనా ఇలాంటి యాప్స్, వెబ్‌సైట్ల గురించి తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని సజ్జనార్ తెలిపారు.


