తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. ప్రజా, సాధారణ పరిపాలన, రెవెన్యూ, ప్రత్యేక కార్యక్రమాల అమలు, యువజన, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, పురపాలక పరిపాలన, పట్టణ, నీటి సరఫరా శాఖల బాధ్యతలు కూడా ఆయన నిర్వహించనున్నారు.
సీనియర్ నేత కేఏ సెంగోట్టయ్యన్‌కు ఆర్థిక శాఖ కేటాయించారు. విజయ్ కేబినెట్లో పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖను కేటాయించారు. టీవీకేలో కీలకమైన ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రి ఆదవ్ అర్జునకు ప్రజా పనులు, క్రీడాభివృద్ధి శాఖలు కేటాయించారు. క్రీడాభివృద్ధితో పాటు భవనాలు, రహదారులు, చిన్న ఓడరేవులతో సహా ప్రజా పనులను ఆయన పర్యవేక్షిస్తారు. డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్‌కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను కేటాయించారు. పి. వెంకటరమణన్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖలు లభించాయి. వినియోగదారుల పరిరక్షణ, ధరల నియంత్రణ వ్యవహారాలు కూ ఆయన పర్యవేక్షణలో ఉన్నాయి. మంత్రి ఆర్. నిర్మల్ కుమార్‌కు ఇంధన వనరులు, న్యాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. విద్యుత్, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, న్యాయస్థానాలు, జైళ్లు, అవినీతి నివారణ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్‌ల శాఖలు ఆయన పరిధిలోకి వస్తాయి.
మంత్రి రాజ్‌మోహన్‌కు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచార, ప్రచార శాఖ బాధ్యతలు అప్పగించారు. పురావస్తు శాస్త్రం, తమిళ అధికార భాష, తమిళ సంస్కృతి, ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ, ప్రింటింగ్, ప్రభుత్వ ముద్రణాలయాలను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. మంత్రి డాక్టర్ టి.కె. ప్రభుకు సహజ వనరుల శాఖను కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖల బాధ్యతలను ఆయనకు అప్పగించారు.

































