తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) భారీ కాంస్య విగ్రహం హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనం చౌరస్తాలో కొలువుదీరింది. నూతనంగా ఏర్పాటుచేసిన 23 అడుగుల ఎన్టీఆర్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గతంలో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, మైత్రీవనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. నగరంలోని ఎన్టీఆర్ అభిమానుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయించి మరీ ఆవిష్కరించారు.
ఈ విగ్రహ ఏర్పాటు ప్రక్రియ విజయవంతం కావడంలో స్థానిక ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ విగ్రహ స్థాపన పనులను ఆయన దగ్గరుండి పర్యవేక్షించారు. నగర నడిబొడ్డున ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించడం పట్ల నందమూరి అభిమానులు, తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, భారీ సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
………….


