కరెన్సీ మార్కెట్‌లో రూపాయి పతనాన్ని స్వేచ్ఛగా కొనసాగనివ్వాలని, మరికొంత కాలం ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) జోక్యం చేసుకోవద్దని ఆర్‌బిఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. అప్పుడే అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఒత్తిళ్లను భారతీయ కరెన్సీ తట్టుకోగలదని వ్యాఖ్యానించారు. అలాగే ద్రవ్యోల్బణం విజృంభిస్తే, దాన్ని కట్టడి చేసేందుకు వడ్డీరేట్ల పెంపునకు బదులు ఇతర ద్రవ్యపరమైన సాధనాలను వినియోగించాలని ఆర్బీఐకి దువ్వూరి సూచించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను రెండో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షను వచ్చే వారం ఆర్‌బిఐ చేపట్టనున్న క్రమంలో దువ్వూరి వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోవడం లో ద్రవ్య విధానం పాత్ర ఎప్పుడూ చివర్లోనే అని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే వడ్డీరేట్ల పెంపుతోనే ద్రవ్యోల్బణం ఆందోళనల్ని తగ్గించవచ్చని విశ్వసిస్తే ఆర్‌బిఐ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేయవచ్చునని కూడా అన్నారు.


