తొలిసారి హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన మహానాడు గ్రాండ్ సక్సెస్ అయిందని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మహానాడును సమర్థంగా నిర్వహించడంలో భాగస్వాములైన నేతలు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు జోనల్ కో-ఆర్డినేటర్లు, ముఖ్య నేతలతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్ముందు పార్టీ తరఫున నిర్వహించే భారీ కార్యక్రమాలకు మహానాడు-2026ను బెంచ్ మార్క్‌గా తీసుకోవాలని సూచించారు. ఏపీతో పాటు ఈసారి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మహానాడు బాగా జరిగిందని నేతలు సీఎంకు వివరించారు.
మహానాడులో తెలంగాణ టీడీపీ సీనియర్ నేత బక్కని నర్సింహులు తెలంగాణపై చేసిన వ్యాఖ్యలను సీఎం తప్పుబట్టారు. ఎంతో చరిత్ర, నేపథ్యం ఉన్న ప్రాంతాల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తెలుగువారు ఎక్కడ ఉన్నా తెలుగుజాతి ఒక్కటేనని, ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడకూడదని సీఎం వ్యాఖ్యానించారు. టీడీపీ పుట్టిందే తెలంగాణ గడ్డపై అని, తెలంగాణలో పార్టీకి ఇప్పటికీ బలమైన కేడర్ ఉన్నారని అన్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత తెలంగాణలో సామాజిక న్యాయం, అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. మహానాడులో ఆమోదించిన 33 శాతం మహిళా రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు సూచించారు.


