దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రియాంకా మోహన్ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కించుకుంది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆమె తాజా చిత్రం మేడ్ ఇన్ కొరియా గ్లోబల్ వైడ్‌గా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆమె క్రేజ్ ఒక్కసారిగా అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ సూపర్ హిట్ చిత్రం సాధించిన అద్భుతమైన సక్సెస్ తర్వాత, కొరియా టూరిజం ఆర్గనైజేషన్ ప్రియాంకా మోహన్‌ను కొరియా టూరిజం గౌరవ అంబాసిడర్ గా అధికారికంగా నియమించింది.
కొరియా సంస్కృతిని, అక్కడి పర్యాటక రంగ విశేషాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు, ముఖ్యంగా భారతీయులకు మరింత దగ్గర చేసేందుకు కొరియా ప్రభుత్వం ఆమెను ఈ గౌరవ పదవికి ఎంపిక చేసింది. రోజురోజుకూ పెరుగుతున్న తన అంతర్జాతీయ ఫ్యాన్ బేస్‌తో ప్రియాంక ఒక గ్లోబల్ స్టార్‌గా అవతరిస్తూ ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ అరుదైన గౌరవం దక్కడంపై ప్రియాంకా మోహన్ హర్షం వ్యక్తం చేస్తూ, తనకు ఈ అవకాశం కల్పించిన కొరియా ప్రభుత్వానికి మరియు కొరియా టూరిజం ఆర్గనైజేషన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది.


