నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సిఎం జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ప్రముఖ ప్రజాకవి, స్వాతంత్ర్య సమరయోధుడు కాళోజీ అన్నారని తెలిపారు. ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కల సాకారం చేసిన నాటి దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ కు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. కాళోజీ స్ఫూర్తితో అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్ర హితం కోసం శ్రమిస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధికి ఈ ప్రభుత్వం సమప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని, రాచరికాన్ని పెత్తనాన్ని తెలంగాణ సమాజం సహించదని సూచించారు. ప్రభుత్వం అంటే నలుగురి చేతిలో ఉండే పెత్తనం కాదని, మాది ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రజాప్రభుత్వం అని పేర్కొన్నారు.
గత 30 నెలల్లో ప్రజల ఆకాంక్షలు నెవేర్చడంలో విజయవంతం అయ్యామని, తెలంగాణ విజన్- 2047 లక్ష్యం సాధించే దిశగా వెళ్తున్నామని అన్నారు. రైతులను వ్యవసాయ పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని, 2025-26 ఏడాదిలో రికార్డుస్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించామని అన్నారు. రాష్ట్రంలో 2.36 కోట్ల టన్నుల పంట దిగుబడి వచ్చిందని, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేలా ఎదగాలని సూచించారు. ఒకేసారి రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను రుణవిముక్తి చేశామని, తొలి ఏడాదిలోనే రైతుల ఖాతాల్లో రూ.22 వేల కోట్లు జమ చేశామని చెప్పారు. రైతుల పంటలు చివరిగింజ వరకు కొనేందుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బు రూ. 11,300 కోట్లు జమచేశామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని స్పష్టం చేశారు.


