ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. లెబనాన్ లో ఇజ్రాయెల్ చేపడుతున్న సైనిక చర్యలు, ఇరాన్ తో అమెరికా జరుపుతున్న కీలక చర్చలకు ఆటంకం కలిగిస్తున్నాయని ట్రంప్ తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో నెతన్యాహుపై ట్రంప్ అత్యంత కఠినమైన, ఘాటైన పదజాలం ఉపయోగించారని అమెరికా అధికారులు వెల్లడించారు. ఈ సంభాషణ ఇరుదేశాల మధ్య సంబంధాల్లో ఉన్న ఉద్రిక్తతలను మరోసారి బయటపెట్టింది.
నెతన్యాహుపై తన అసహనాన్ని ట్రంప్ దాచుకోలేకపోయారు. నీకు పిచ్చి పట్టిందా? నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ఇప్పుడు నీ వల్ల ఇజ్రాయెల్‌ను కూడా అందరూ ద్వేషిస్తున్నారు అని ట్రంప్ అన్నట్టు అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అసలు ఏం చేస్తున్నావ్ నువ్వు? అంటూ నెతన్యాహుపై ట్రంప్ గట్టిగా అరిచినట్టు ఆయన చెప్పారు. ఇజ్రాయెల్ చర్యలు ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకిని చేస్తాయని, దౌత్యపరమైన ప్రయత్నాలను దెబ్బతీస్తాయని ట్రంప్ ఈ సందర్భంగా హెచ్చరించినట్లు సమాచారం.


