ఏపీ ప్రభుత్వానికి ఉత్తర అమెరికాలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన తర్వాత తొలిసారిగా డాలస్ నగరంలో జయరాం కోమటి పర్యటించారు. ఇర్వింగ్‌లోని, అమెరికాలోనే అతిపెద్దదైన మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి మహాత్ముడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యుడు అనంత్ మల్లవరపు కలిసి జయరాం కోమటికి స్వాగతం పలికి జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ డాలస్ నగరంలోని మహాత్మాగాంధీ స్మారక స్థలి భారతీయులందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన యాత్రాస్థలి అని వ్యాఖ్యానించారు. ప్రసాస భారతీయుల ఐక్యతకు, కార్యదీక్షకు మహాత్మాగాంధీ మెమోరియల్ ఒక నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు.


