దేశంలో ఆర్థిక సునామీ రాబోతోందని, కీలక వ్యవస్థల్లో అంతర్గతంగా అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ప్రజా వ్యతిరేకతను అణచి వేయటానికి ఎమర్జెన్సీని విధించినా విధించవచ్చని కేంద్ర ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ప్రజలను భయపెట్టి బతుకవద్దని రాహుల్‌కు చురకలు వేసింది. ఆర్థిక సునామీ 2013 లోనే వచ్చిందని, ఇప్పుడు కాదని బీజేపీ నేత అమిత్ మాలవీయ పేర్కొన్నారు. కాంగ్రెస్ వినాశనాన్ని సృష్టిస్తే బీజేపీ దృఢంగా ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు భిన్నంగా వాస్తవ పరిస్థితి ఉందని, ఆర్థిక వ్యవస్థ బయటి నుంచి షాక్ ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ నిస్సహాయంగా లేదని తెలిపారు. ఈ దశాబ్ద కాలంలో ఆ షాక్‌లను తట్టుకొనే వ్యవస్థలను నిర్మించామని చెప్పారు. విద్యుత్ వినియోగం, వాహనాల విక్రయాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ-వే బిల్ జనరేషన్‌లో పెరుగుదల ఉందని, ద్రవ్యోల్బణం అదుపులో ఉందని, ఆహారం, విదేశీ మారకద్రవ్య నిల్వలు సరిపడా ఉన్నాయని మాలవీయ వెల్లడించారు.


