మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది నేడు విడుదలై పాజిటివ్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ నేపథ్యంలో సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటూ హీరోయిన్ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తులు ధరించిన జాన్వీ కపూర్ అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చేరుకున్నారు. దారిపొడవునా ఆమెను చూసేందుకు అభిమానులు ఎగబడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. సాంప్రదాయ లుక్‌లో ఎంతో ఒదిగిపోయి నడిచివచ్చిన జాన్వీకి ఫ్యాన్స్ ఘనస్వాగతం పలకడమే కాకుండా, ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు విపరీతమైన ఆసక్తి చూపించారు. రామ్ చరణ్ రస్టిక్ అండ్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక పవర్‌ఫుల్ అథ్లెట్‌గా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.


