ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మీటింగ్‌కి అనుమతి ఇస్తే ఏమవుతుంది? అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రశ్నించారు. హైదరాబాద్ రాంచందర్ రావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు వ్యతిరేకంగా, పవన్ ఎప్పుడూ మాట్లాడలేదని అన్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ని మరోసారి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంని ఎందుకు దగ్గరకు తీసుకున్నారని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్, జనసేన సభ కోసం అనుమతి అడిగారని, ఇచ్చి ఉంటే కథ అక్కడే ముగిసేదని, సభకు అనుమతి ఎందుకు ఇవ్వలేదో కాంగ్రెస్ సర్కార్ చెప్పాలని రాంచందర్ రావు ప్రశ్నించారు. ఈ సమావేశం పెట్టుకోవడం ప్రతి ఒక్కరి ప్రజాస్వామ్య హక్కు అని చెప్పారు. దాన్ని అడ్డుకోవడమే ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలని నిలదీశారు. పవన్ కల్యాణ్ అంశాన్ని బీజేపీ మీద రుద్దే ప్రయత్నం చేయడం రాజకీయ దివాళాకోరుతనమని ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ కలిస్తేనే కొందరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు.
……………


