నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఈసారి మరింత వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే అభిమానులు బాలయ్య పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతుండగా, ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఈ వేడుకలను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది. జూన్ 1 నుంచి 10వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక వేడుకలతో బాలయ్య బర్త్‌డే ఉత్సవాలను పండుగలా జరుపుతోంది. ఈ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లో భోళా బాలయ్య పేరుతో రూపొందించిన ప్రత్యేక సిగ్నేచర్ సాంగ్‌ను ఘనంగా విడుదల చేశారు. బాలకృష్ణ వ్యక్తిత్వం, సేవా కార్యక్రమాలు, అభిమానులతో ఆయనకున్న అనుబంధాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పాట ఆవిష్కరణ కార్యక్రమం సినీ ప్రముఖుల సమక్షంలో అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ బాలకృష్ణ వ్యక్తిత్వంపై ప్రశంసలు కురిపించారు. సమాజంలో సేవా కార్యక్రమాలు చేసే వారిని ప్రజలు ఎప్పుడూ గౌరవిస్తారని, బాలకృష్ణ కూడా అలాంటి వ్యక్తుల్లో ఒకరని అన్నారు. బాలకృష్ణ గారికి సేవా కార్యక్రమాలంటే ఎంతో ఇష్టం. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కేవలం సినిమాల్లో హీరోగా కనిపించడమే కాదు, నిజ జీవితంలో కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అభిమానులు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా గొప్ప విషయం అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు. అలాగే బాలకృష్ణతో తాను చేసిన సినిమాల ద్వారా ఆయన మాస్ ఇమేజ్‌ను ప్రేక్షకులకు చూపించానని, ఇప్పుడు భోళా బాలయ్య పాట ఆయన వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తోందని చెప్పారు. ఈ పాటలోని సాహిత్యం, సంగీతం, విజువల్స్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు.

































