తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణిలో యాత్ర చేశానని, రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సింగరేణి ఉద్యోగుల ఇన్ కమ్ టాక్స్ మినహాయింపు చేస్తానని బిజెపి నాయకుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలను అడిగినా చేయలేదని, 2028లో అధికారంలోకి రాగానే ఖచ్చితంగా వారికి ఆదాయపుపన్ను మినహాయింపు ఇస్తామని చెప్పారు. హైదరాబాద్లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో గత 12 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, సంస్కరణలపై నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణికి సంబంధించి రెండేళ్లలో ఖర్చులు తగ్గించే ప్రయత్నం చేశానని, కోలిండియాతోపాటుగా సింగరేణి ఉద్యోగస్తులకు ఇన్సూరెన్స్ పెంచామని, గతంలో 30 లక్షలు, 40 లక్షలుండే ప్రమాదబీమాను నేడు కోటి రూపాయలకు పెంచామని చెప్పుకొచ్చారు. ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ ను తగ్గించేందుకు అండర్ గ్రౌండ్ మైనింగ్ ను ప్రోత్సహిస్తున్నామని, ప్రయివేట్ మైనింగ్, కమర్షియల్ మైనింగ్ కారణంగా ఉద్యోగాలు పెరుగుతున్నాయన్నారు. కమర్షియల్ మైనింగ్ ద్వారా 800 మిలియన్ టన్నుట బొగ్గు ఉత్పత్తి జరగడంతో పాటు దానికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన పెరుగుతుందని తెలిపారు.

































