ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) పార్టీలో అంతర్గత విభేదాలు నెలకొన్నాయి. మాజీ సిఎం, టిఎంసి అధినేత్రి మమత బెనర్జీకి షాకిస్తూ, సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ పార్టీకి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో పార్టీ నాయకుల్లో అసమ్మతి సెగలు ఎక్కువైనట్లు తెలుస్తోంది. తాజాగా టిఎంసికి చెందిన 20మంది ఎంపీలు మమతకు వ్యతిరేకంగా సపరేట్ వర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం టిఎంసి రెబల్ ఎంపీలు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. దీంతో లోక్సభలో త్వరలోనే ప్రత్యేక టిఎంసి వర్గం ఏర్పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు 20 మంది రెబల్ ఎంపీలు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని రెబల్ ఎంపి కాకోలి ఘోష్ దస్తీదార్ వెల్లడించారు. మేము బెంగాల్ ఎన్నికల తీర్పును అంగీకరించాము. మా భవిష్యత్తు రాజకీయ ప్రయాణం ఎన్డీయేతో కలిసి సాగాలని భావిస్తున్నాము అని కాకోలి తెలిపారు.

































