ఇద్దరు మేజర్లు ఇష్టపూర్వకంగా పెళ్లికిముందే శారీరక సంబంధం పెట్టుకుంటే వారి ప్రవర్తన లేదా క్యారెక్టర్‌ను తప్పుబట్టలేమని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. పరస్పర అంగీకారంతో సాగిన ఇలాంటి సంబంధాలను చట్టం ఏమాత్రం నిషేధించలేదని స్పష్టంచేసింది. తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి అనే వ్యక్తి కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అయితే పెళ్లికి ముందు ఓ మహిళతో శారీరక సంబంధం పెట్టుకుని మోసం చేశాడనే కారణంతో తెలంగాణ ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని రద్దుచేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ 2014లో తిరుపతిపై ఓ యువతి క్రిమినల్ కేసు పెట్టింది. ఆ తర్వాత 2015లో లోక్ అదాలత్ ద్వారా ఇరువర్గాలు రాజీకొచ్చాయి. ఈ పాత కేసును కారణం చూపిస్తూ తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అతని ఉద్యోగాన్ని రద్దుచేసింది. దీనిపై సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పోలీసు బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టింది. మారుతున్న సామాజిక పరిస్థితుల్లో పెళ్లికి ముందే ప్రేమించుకోవడం, శారీరక సంబంధాలు కలిగి ఉండటం సాధారణంగా మారిందని కోర్టు వ్యాఖ్యానించింది.

































