మహిళలను కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేదే లేదని మీకు ఏం కావాలన్నా చేయడానికి ముఖ్యమంత్రిగా మీ సోదరుడు ఉన్నాడని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ లో నిర్వహించిన మహిళాశక్తి సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతులోనే ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తానని వ్యాపార ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ సరఫరా అంతా మహిళలకు అప్పగించే బాధ్యత తానే తీసుకుంటాన్నారు. దళారులు, దోపిడీదారులు, కమిషన్ ఏజెంట్లకు ఈ ప్రభుత్వంలో స్థానం లేదని అన్నారు. మీకు అండగా ఉండే బాధ్యత నాది, సీతక్కదీ అని చెబుతూ మహిళా సంఘాలు కొనుగోలు చేసే బస్సులు ఆర్టీసిలో పెట్టుకునే బాధ్య ఈ ప్రభుత్వానిదని భరోసా ఇచ్చారు. పెట్రోల్ బంకుల నిర్వహణ, సోలార్ విద్యుత్ ఉత్పత్తిలోనూ- ఆదానీ, అంబానీతో మన మహిళలు పోటీపడుతున్నారని పేర్కొన్నారు. వ్యవసాయానికి ప్రాణవాయువు ఆడబిడ్డలేనని అన్నారు.
రైతు మహిళా సమాఖ్యలు ఏర్పాటు చేసుకోవాలని ఆ దిశగా కలెక్టర్లను తాను ఆదేశాలు జారీ చేస్తానని అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తే కొంతమంది కడుపునొప్పితో ఆటో డ్రైవర్లను రెచ్చగొట్టారన్నారు. వారితో ధర్నా చేయించి ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం ఆపేందుకు కడుపులో విషం, కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. ఉచిత బస్సుతో ఆడపిల్లల డ్రాపవుట్స్ తగ్గాయన్నారు.

































