హైదరాబాద్ ను విశ్వనగరమని చెప్పుకుంటున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ లో అంతర్జాతీయ ప్రమాణాతో రవాణా సౌకర్యాలు కూడా ఉండాలని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో హైదరాబాద్ లో మెట్రో నిర్మించాలని, 2017 నాటికి 15 వేల కోట్లతో నిర్మాణం పూర్తి చేయాలనే ప్రణాళికతో ప్రారంభించారు తెలియజేశారు. చారిత్రక ప్రాంతాలు ఉన్నాయని బిఆర్ఎస్ హయాంలో మెట్రో పనులు పెండింగ్ పెట్టారని, 2014 నుంచి 2017 వరకు మెట్రో నిర్మాణం ఆగిపోయిందని, 2020 వరకు కూడా మెట్రో పూర్తి కాలేదని విమర్శించారు. దీంతో అంచనా వ్యయం రూ.20 వేల కోట్లకు వెళ్లిందని, బిఆర్ఎస్ హయాంలో మెట్రో విస్తరణపై ఆలోచన లేదని మండిపడ్డారు. తాము అధికారం లోకి రాగానే మెట్రో విస్తరణ గురించి ఆలోచించామని, సెకండ్ ఫేస్ కు అనుమతులు ఇవ్వాలని ప్రధాని సహా కేంద్ర మంత్రులను కోరామని అన్నారు. విస్తరణకు ఎల్ అండ్ టి అంగీకరించలేదని, గత ప్రభుత్వం తీరుతో రూ.7 వేల కోట్ల నష్టం వచ్చిందని ధ్వజమెత్తారు. మెట్రో విస్తరణకు ఎల్ అండ్ టి ఒప్పుకోకపోవడంతో ప్రత్యామ్నాయం కోసం కేంద్రాన్ని సంప్రదించామని, ఎల్ అండ్ టిని కొనాలని కేంద్రమే చెప్పిందని, ఫేస్-1 కు రాష్ట్ర్ర ప్రభుత్వమే యజమాని అయితే, ఫేస్-2 కు సులభంగా అనుమతులు వస్తాయని చెప్పిందని రేవంత్ పేర్కొన్నారు.
రూ.30 వేల కోట్ల ఎల్ అండ్ టి ఆస్తిని రూ. 15 వేల కోట్లకే ప్రభుత్వం కొనుగోలు చేసిందని, ఏడాదికి రూ. 400 కోట్లు నష్టం వస్తుందని ఎల్ అండ్ టి డి చెప్పిందని అన్నారు. మాజీ సిఎం కెసిఆర్ కి పిఎఫ్ సి, ఆర్ఇసి రూ. 3వేల కోట్లు అప్పు ఇచ్చాయని, కెసిఆర్ 9.5 నుంచి 11.5 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని అన్నారు. మెట్రో ప్రాజెక్టు ను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, మెట్రో నిధుల విషయంలో కేంద్రం తిరకాసు ఉందని, ఇవాళ నిధులు విడుదల కావాల్సి ఉందని హెచ్చరించారు. తెలంగాణలో బిజెపి ఉండాలా? మూసేయాలా? అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడిగారని, నిధులను కిషన్ రెడ్డి విడుదల చేయిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. కుట్ర పూరిత ఆలోచనతో బిఆర్ఎస్, బిజెపి కుట్రలు చేస్తున్నాయని, మెట్రో విస్తరణకు కిషన్ రెడ్డి ఎన్ఒసి ఇప్పించాలని సూచించారు. ఎన్ఆర్ఎఫ్ సి లోన్ ఎందుకు ఇవ్వడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలని అన్నారు.
………

































