తమిళనాడు అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా త్రిభాషా సూత్రం, నీట్ వివాదం, కరూర్ తొక్కిసలాట ఘటన తదితర అంశాలను ప్రస్తావించారు. ఈ ప్రసంగం ద్వారా విజయ్ విమర్శకులకు గట్టిగా బదులిచ్చారు. ఎన్నో సవాళ్లను దాటి తాము అధికారంలోకి వచ్చామని, నటుడి పార్టీ అని తమను ఎంతోమంది ఎగతాళి చేశారని గుర్తుచేసుకున్నారు. తమకు ఈ అధికారం అంత సులువుగా వచ్చింది కాదని, తమిళనాడు ప్రజల హృదయాలను గెలుచుకునేందుకు తాను, తన పార్టీ ఎన్నో కుట్రలు, సవాళ్లను అధిగమించాల్సి వచ్చిందని చెప్పారు. తమది యాక్టర్ పార్టీ అని, తాను సినిమా షూటింగ్ నుంచి నేరుగా సీఎం కుర్చీలో కూర్చున్నానని చాలా మంది గేలి చేశారని విజయ్ వెల్లడించారు. అయితే అలాంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. సాధారణంగా చాలా మంది రాజకీయ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్తారని, కానీ తాను ప్రజల్లోకి వెళ్లిన తర్వాత పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశానని, తనపై నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని తెలిపారు.
నీట్ విధానం విద్యా వ్యవస్థలో అసమానతలను సృష్టిస్తోందని, దీన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తమిళనాడులో త్రిభాషా సూత్రాన్ని అమలు చేయబోమని, ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నామని సీఎం పునరుద్ఘాటించారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటనను విజయ్ ప్రస్తావించారు. 41 మంది ప్రాణాలు కోల్పోయిన ఆ విషాద ఘటన తనను ఎంత వేదనకు గురిచేసిందో మాటల్లో చెప్పలేనని అన్నారు. ఆ బాధ తనను ఎన్నటికీ వదలదని చెప్పారు. తొక్కిసలాట ఘటన విషయంలోనూ తమపైనే నిందలు వేశారని, ఇది అత్యంత దారుణమని అన్నారు.

































