హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు మహిళా లోకాన్ని అవమానించేలా ఉన్నాయని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ సంస్కారహీన, దివాళాకోరు రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా అమర్నాథ్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆగ్రహించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక అర్హత వైసీపీ నాయకులకు లేదని ధ్వజమెత్తారు. గొడ్డలి పార్టీ నేతల మాటల్లో మహిళల పట్ల గౌరవం, బాధ్యత పూర్తిగా లోపించాయని మండిపడ్డారు. గుడివాడ అమర్నాథ్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళల గౌరవం, ఆత్మాభిమానాన్ని కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టంచేశారు. వైసీపీ నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలని హితవు పలికారు.హోంమంత్రి అనితపై గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

































