పశ్చిమాసియాలో యుద్ధాన్ని నివారించి ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి అమెరికా సిద్ధమవుతుంటే, ఈ ప్రయత్నాలకు ఇజ్రాయెల్ గండికొడుతోంది. లెబనాన్‌పై వరుసగా దాడులు చేస్తోంది. శనివారం కూడా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. దక్షిణ లెబనాన్‌పై ఈ రోజు ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ఐదుగురు మరణించారు. హెజ్బొల్లా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని అమెరికా ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే, ఇజ్రాయెల్ దాడికి దిగడం విశేషం.
దక్షిణ లెబనాన్‌లోని నబాతే జిల్లాలోని అనేక ప్రదేశాలపై ఇజ్రాయెల్ డ్రోన్ దాడులు చేసింది. ఈ దాడుల్లో అనేక ఇండ్లు, బిల్డింగులు ధ్వంసమయ్యాయి. ఐదుగురు మరణించారు. ఫిరంగి దాడులు కూడా జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. కొద్ది రోజులుగా వరుసగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అంతకుముందు జరిపిన దాడుల్లో కూడా 16 మంది మరణించారు. అనేకమంది గాయపడగా, పలువురు కూలిన బిల్డింగులు, ఇండ్ల శిథిలాల కింద చిక్కుకుపోయారు. అయితే, ఇజ్రాయెల్ దాడులపై అమెరికా ఆగ్రహంగా ఉంది. ఒకపక్క ఇరాన్‌తో అమెరికా శాంతి ఒప్పందం కుదుర్చుకుని, యుద్ధాన్ని ముగించాలని భావిస్తుంటే, ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మిత్రదేశమైన లెబనాన్‌పై దాడులు చేస్తోంది. అక్కడ ఇరాన్ మద్దతుతో నడుస్తున్న హెజ్బొల్లా ఉగ్రవాద శిబిరాల్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేస్తోంది.

































