తెలుగు వంటింట్లో చింతచిగురుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం రుచికరమైన ఆహారం మాత్రమే కాదు, ఒక అద్భుతమైన సహజ ఔషధం. ముఖ్యంగా పల్లెటూళ్లలో చింతచిగురు పప్పు, పచ్చడి, కూరలకు క్రేజ్ ఎక్కువ. ఆయుర్వేదంలో కూడా దీనికి ఎంతో ప్రాధాన్యత ఉంది.చింతచిగురులో పీచు పదార్థం (ఫైబర్) పుష్కలంగా ఉంటుంది. ఆ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే చింతచిగురులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఎక్కువ. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా సీజనల్ ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా ఎండకాలంలో శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడానికి ఇది బాగా పనిచేస్తుంది.
చింతచిగురు ప్రయోజనాలు కేవలం జీర్ణక్రియతోనే ఆగిపోవు. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా తోడ్పడుతుంది. ఇందులో ఉండే సహజ సమ్మేళనాలు కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.
అంతేకాకుండా ఇందులో కాల్షియం, ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. పూర్వకాలం నుండి ఒక సంప్రదాయం ఉంది. గొంతు నొప్పిగా ఉన్నప్పుడు చింతచిగురు ఉడికించిన నీటితో పుక్కిలిస్తారు. ఇది గొంతు అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి బాడీని డిటాక్స్ చేయడానికి ఇది ఒక బెస్ట్ నేచురల్ ఫుడ్.

































