న్యాయరంగంలో కృత్రిమ మేథ కొత్త చరిత్ర సృష్టించింది. బ్రిటన్‌కు చెందిన గార్ఫీల్డ్ ఏఐ అనే ఏఐ ఆధారిత న్యాయసంస్థ, న్యాయవాదులతో పోటీపడి కోర్టు కేసులో విజయం సాధించింది. ప్రపంచంలో ఏఐ ఆధారిత న్యాయసంస్థ నేరుగా గెలిచిన తొలి కేసుగా దీనిని భావిస్తున్నారు. ఫ్రీలాన్స్ హెచ్ఆర్ ప్రొఫెషనల్ టామిరెస్ కమల్ టాక్విడిర్‌కు ఒక హాస్పిటాలిటీ సంస్థ చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టింది. దాంతో గార్ఫీల్డ్ ఏఐ సంస్థను ఆశ్రయించి ఆ సంస్థ సేవలను ఆమె పొందింది. కేవలం 400 పౌండ్ల (సుమారు రూ.50 వేలు) ఫీజుతో గార్ఫీల్డ్ ఏఐ సంస్థ ఈ సేవలు అందించింది. ఏఐ సాయంతో ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర న్యాయపరమైన డాక్యుమెంట్లన్నీ గార్ఫీల్డ్ ఏఐ సంస్థ సిద్ధం చేసింది. విచారణ వేళ ఒక మానవ న్యాయవాదిని కోర్టులో వాదనలు వినిపించేందుకు నియమించింది. లండన్‌లోని వాండ్స్‌వర్త్ కౌంటీ కోర్టులో దాదాపు మూడు గంటలపాటు విచారణ జరిగింది. ఇరుపక్షాల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు.

































