భారత్ నుంచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కి లండన్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా దాఖలు చేసిన కేసులో నీరవ్ మోదీ తన కంపెనీ రుణం కోసం ఇచ్చిన వ్యక్తిగత గ్యారెంటీ 10.7 మిలియన్ డాలర్ల (సుమారు రూ.100 కోట్లు) కంటే ఎక్కవ చెల్లించాల్సిందేనని కోర్టు తీర్పునిచ్చింది. లండన్ సర్క్యూట్ కమర్షియల్ కోర్ట్ జడ్జి జస్టిస్ సైమన్ టింక్లర్ జూన్ 23 నాటి తీర్పులో ఈ విషయాన్ని స్పష్టంచేశారు. అసలు మొత్తం 4.1 మిలియన్ డాలర్లతో పాటు దానికి సంబంధించిన వడ్డీని కూడా నీరవ్ మోదీ నుంచి వసూలు చేయాలని ఆదేశించారు. ఈ గ్యారెంటీ చెల్లదని, తనకు సరైన డిమాండ్ నోటీసులు రాలేదని నీరవ్ మోదీ చేసిన వాదనలను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా జూలై 2012లో దుబాయ్ ఆధారిత ఫైర్‌స్టార్ డైమండ్ ఎఫ్‌జెడ్‌ఈ అనే నీరవ్ మోదీకి చెందిన సంస్థకు భారీ రుణాన్ని మంజూరు చేసింది. ఈ రుణ సదుపాయానికిగాను ఆగస్టు 3, 2013న నీరవ్ మోదీ వ్యక్తిగత పూచీకత్తు ఇచ్చారు. అయితే 2018 ప్రారంభంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణం వెలుగులోకి రావడంతో, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాన్ని వెనక్కి తీసుకుంది.

































