అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది. ప్రస్తుతం ఇరాన్‌లో పరిస్థితులు కొంత మెరుగుపడుతున్నప్ప టికీ, అత్యవసర అవసరం లేకపోతే ఆ దేశానికి ప్రయాణించవద్దని భారత పౌరులకు సూచించింది. ఇరాన్‌లోని భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కొన్ని సానుకూల పరిణామాలు కనిపిస్తున్నప్పటికీ,అక్కడ నివసిస్తున్న భారతీయులు పూర్తి అప్రమత్తతతో ఉండాలని పేర్కొంది. స్థానిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండటంతో పాటు సంబంధిత అధికారులు జారీచేసే భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే తదుపరి ప్రకటనలు వెలువడే వరకు ఇరాన్‌కు అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని ఎంబసీ స్పష్టం చేసింది.

































