సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, మహిళల భద్రత వంటి అంశాలు ఎప్పటికప్పుడు చర్చనీయాంశంగా మారుతూనే ఉంటాయి. పలువురు నటీమణులు, గాయకులు, సాంకేతిక నిపుణులు గతంలో ఈ అంశాలపై తమ అనుభవాలను పంచుకున్నారు. తాజాగా ప్రముఖ సింగర్ సునీత చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇండస్ట్రీలో మహిళల భద్రతపై చర్చకు దారితీశాయి.ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సునీత సినీ పరిశ్రమ మహిళలకు పూర్తిగా సురక్షితమైన ప్రదేశం కాదని స్పష్టం చేశారు. తాను ఇండస్ట్రీలో విజయవంతమైన మహిళ అయినప్పటికీ ఈ విషయాన్ని నిజాయితీగా చెబుతున్నానని పేర్కొన్నారు.సినీ ఇండస్ట్రీ మహిళలకు కచ్చితంగా సేఫ్ కాదు. నేను ఈ పరిశ్రమలో సక్సెస్‌ఫుల్ వుమెన్ అయినా కూడా ఇదే చెబుతున్నాను. బయటకు వచ్చి నాకు ఇలా జరిగింది, అలా జరిగింది అని చెప్పడం నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది ఒక్కరి సమస్య కాదు. చాలా మంది ఎదుర్కొనే పరిస్థితి అని అన్నారు.
ఇండస్ట్రీలో కొన్ని సందర్భాల్లో దోపిడీ, అసభ్య ప్రవర్తన వంటి సమస్యలు ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు కేవలం 18 ఏళ్ల వయసులోనే ఇలాంటి అసౌకర్యకర పరిస్థితి ఎదురైందని సునీత వెల్లడించారు. అయితే ఆ ఘటన గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి ఆమె ఆసక్తి చూపలేదు.ఆ విషయాలను పదే పదే చర్చించడం నాకు ఇష్టం ఉండదు. అలాంటి చర్చలకు ముగింపు ఉండదు అని ఆమె అన్నారు.ఇండస్ట్రీలో కొంతమంది ఒకరి వద్ద చాలా గౌరవంగా ప్రవర్తిస్తే, మరొకరి వద్ద పూర్తిగా భిన్నంగా ప్రవర్తించే పరిస్థితులు ఉంటాయని సునీత వ్యాఖ్యానించారు. ఒక వ్యక్తి ఒకరి దగ్గర పెద్దమనిషిలా ప్రవర్తించవచ్చు. అదే వ్యక్తి మరొకరి వద్ద వేరేలా ప్రవర్తించవచ్చు అంటూ ఆమె పేర్కొన్నారు. మహిళల స్వేచ్ఛ, ఫెమినిజం గురించి కూడా సునీత తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మై బాడీ మై రైట్ అని మహిళలు చెబితే, హిస్ ఐస్ హిస్ రైట్ అని మరో కోణం కూడా వస్తుంది. ఫెమినిజం అంటే ఏమిటి అనే అంశంపై కూడా చాలా చర్చ అవసరం అని అన్నారు. అలాగే పురుషులు, మహిళలు పూర్తిగా ఒకేలా ఉండరని, సమాజంలో కొన్ని అంశాలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

































