భారతీయ సినీ పరిశ్రమకు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్‌కు ప్రపంచ ప్రఖ్యాత అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ అకాడమీ) నుంచి అధికారిక ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం ద్వారా ఆయన అకాడమీ సభ్యుడిగా చేరే అవకాశం లభించడంతో భారతీయ సినీ వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఈ గౌరవంతో ఆయన రానున్న రోజులలో ఆస్కార్ నామినేషన్స్, విజేతలని నిర్ణయించే ఓటింగ్ హక్కుని కూడా పొందారు. శ్రీకర్ ప్రసాద్‌కి 40 ఏళ్లకి పైగా సినీ ప్రస్థానం ఉంది. దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో అత్యుత్తమ ఎడిటర్‌గా గుర్తింపు పొందిన ఏ శ్రీకర్ ప్రసాద్ అనేక భాషల్లో పనిచేస్తూ తన ప్రత్యేక ముద్ర వేశారు.
తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ చిత్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిభను చాటుకున్నారు. ఇప్పుడు ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం రావడం ఆయన వ్యక్తిగత విజయమే కాకుండా భారతీయ సాంకేతిక నిపుణులకు దక్కిన అరుదైన గౌరవంగా సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.

































