ఇటీవలి కాలంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు కాస్త బలపడుతున్నా యి. ఇరు దేశాల మధ్య ఇటీవలే దౌత్య సేవలు ప్రారంభమయ్యాయి. రాయబార కార్యాలయాలు రెండు దేశాల్లో పని చేస్తున్నాయి. ఈ అంశంలో తాజాగా మరో ముందడుగు పడింది. రెండు దేశాల మధ్య టూరిస్ట్ వీసా సేవలు ప్రారంభం కానున్నాయి. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సేవలు ప్రారంభమవుతుండటం విశేషం. ఈ విషయాన్ని బంగ్లాలో భారత రాయబారి దినేష్ త్రివేది వెల్లడించారు. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని వీసా జారీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ నెల 28 నుంచి టూరిస్ట్ వీసా సేవలు అందుబాటు లోకి రానున్నాయి. దీని ద్వారా బంగ్లాదేశ్ నుంచి ఇండియా రావాలనుకునే వారికి భారత పర్యాటక వీసాలు జారీ అవుతాయి. అలాగే, అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లా పౌరులు ఇండియాలో వైద్యం చేయించుకోవాలి అనుకుంటే, మానవతా కోణంలో స్పందించి ఇండియాకు మెడికల్ వీసాలు కూడా జారీ చేస్తామని దినేష్ త్రివేది తెలిపారు.
వీసాల జారీకి బంగ్లాలో ఐదు కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. అవి ఢాకా, రాజ్‌షాహి, ఛిట్టగాంగ్, సిల్హెట్, ఖుల్నా. కొంతకాలంగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. 2024లో అక్కడి ఇందిరా గాంధీ కల్చరల్ సెంటర్‌ను ధ్వంసం చేయడం నుంచి, భారత వీసా జారీ కేంద్రాలపై దాడులు వంటి కారణాలతో 2024 నుంచి వీసాల జారీ నిలిచిపోయింది.

































