ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ యువకుడు అక్కడ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన షాపుసాని మధుసూదన్ రెడ్డి, మంజుల దంపతుల కుమారుడు షాపుసాని శ్రీనాథ్ రెడ్డి (25) బ్రిటన్‌లో హఠాన్మరణం చెందాడు. ఉన్నత విద్య కోసం లండన్ వెళ్లిన శ్రీనాథ్ రెడ్డి, అక్కడ లీసెస్టర్ పట్టణంలోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఎంఎస్ మొదటి సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసి, ప్రస్తుతం రెండో సంవత్సరం చదువుతున్నాడు.
శ్రీనాథ్ రెడ్డి తన స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు హాజరయ్యాడు. బర్త్‌డే పార్టీ ముగిసిన తర్వాత రాత్రి ఆలస్యంగా లండన్‌లోని తను ఉంటున్న గదికి చేరుకుని నిద్రపోయాడు. అయితే, మరుసటి రోజు ఎంత సమయం గడిచినా శ్రీనాథ్ గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి స్నేహితుడు లోపలికి వెళ్లి చూశాడు. అప్పటికే శ్రీనాథ్ రెడ్డి మంచంపై స్పృహ లేకుండా పడి ఉండటం, మరణించి ఉండటాన్ని గమనించిన స్నేహితుడు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాడు. వెంటనే ఈ సమాచారాన్ని లండన్‌లో ఉన్న ఇతర మిత్రులకు చేరవేశాడు.
శ్రీనాథ్ రెడ్డి స్నేహితులు ఈ విషాద వార్తను స్వగ్రామమైన తలమడ్లలోని అతడి తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. చేతికి అందిన కొడుకు లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడనే వార్త వినగానే తల్లిదండ్రులు మధుసూదన్ రెడ్డి, మంజుల గుండెలవిసేలా రోదించారు. కొడుకు మరణంతో తలమడ్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

































