ప్రజల్లో చైతన్యం వచ్చిందని సర్ ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సర్ ప్రక్రియను ఇసి పార్టీలకు అతీతంగా నిర్వహిస్తోందని, సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. కొందరికి నాలుగైదు ఓట్లు ఉన్నాయని గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారని, డూప్లికేట్ ఓట్లు, దొంగఓట్లను తొలగించేందుకే ఇసి సర్ ప్రక్రియను చేపట్టిందని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఎంతోమంది రోహింగ్యాలు అక్రమంగా ఉన్నారని, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి ఓట్లు, రేషన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు ఉన్నాయని తెలియజేశారు. హైదరాబాద్ లో ఉంటున్న చాలామందికి రెండు ఓట్లు ఉన్నాయని, సమగ్ర ఓటరు జాబితా సవరణను ఎవరూ అడ్డుకోలేరని హెచ్చరించారు. ఇసి అధికారులకు తోడుగా వెళ్లే బిఎల్ వోలు, బిఎల్ఎలు స్థానికులేనని, పాతబస్తీలో బిఎల్ వోలను మజ్లిస్ నేతలు బిఎల్ వోలు ఇంటింటికి వెళ్లొద్దని, ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వొద్దని బెదిరించారని పేర్కొన్నారు.

































