ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో వస్తున్న చిత్రం రాకా. ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా, అది వెంటనే వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా వచ్చిన ఓ అప్డేట్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపుతోంది. అదేంటంటే ఈ సినిమా హీరోయిన్గా రష్మిక మందన, అల్లు అర్జున్‌తో కలిసి మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుందట. ఇప్పటికే పుష్ప, పుష్ప 2 చిత్రాల్లో జోడీగా నటించి ప్రేక్షకులను మెప్పించారు ఈ ఇద్దరు. ఇప్పుడు మరోసారి వెండితెరపై జంటగా కనిపిస్తున్నారనే వార్త రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ సినిమాలో దీపికా పదుకొణే, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్లు హీరోయిన్లుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీపికా షూటింగ్లో పాల్గొంది. కొత్త షెడ్యూల్లో మృణాల్, జాన్వీలతో పాటు రష్మికకు సంబంధించిన కీలక సన్నివేశాలు షూట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఇక షారుక్ ఖాన్ కూడా ఈ సినిమాతో కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్ ఉంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. త్వరలోనే ఓ ఈవెంట్ నిర్వహించి, షారుక్ పాత్రను పరిచయం చేస్తారని తెలుస్తోంది. ఇక సన్ పిక్చర్స్ బ్యానర్‌పై రూ.700 కోట్ల భారీ బడ్జెట్‌తో కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో షూటింగ్ పూర్తి చేసుకొని, వచ్చే ఏడాది డిసెంబర్లో సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారు.

































