వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు వెనిజులాను తీవ్రంగా కుదిపేశాయి. ఈ విపత్తులో ఇప్పటివరకు సుమారు 589 మంది మృతి చెందగా, 4,300 మందికి పైగా గాయపడినట్లు ఆ దేశ ఆరోగ్య మంత్రి కార్లోస్ అల్వరాడో తెలిపారు. కూలిపోయిన భవనాల శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం ప్రజలు, సహాయక బృందాలు తీవ్రంగా గాలింపు చేపట్టాయి. బుధవారం సాయంత్రం సంభవించిన 7.2, 7.5 తీవ్రతల భూకంపాలు వెనిజులాలో గత వందేళ్లలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రకంపనలు పొరుగు దేశాల్లో కూడా తీవ్రంగా అనిపించాయి. వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం రావడంతో మృతుల సంఖ్య,గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
బ్రెజిల్‌లోని అమెజాన్ ప్రాంతం వరకు భవనాలను ఖాళీ చేయించారు. ఇదిలా ఉండగా ఉత్తర వెనిజులాలోని పలు నగరాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం స్థానికులు స్వయంగా గాలింపు చేపట్టారు. దుమ్ము, రక్తంతో కప్పబడి ఉన్న చిన్నారులు, గాయపడిన వారిని శిథిలాల నుంచి బయటకు తీశారు. సిమెంట్ పలక కింద చిక్కుకున్న ఓ మహిళను సహాయక సిబ్బంది సజీవంగా బయటకు తీసిన దృశ్యాలను ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. అయితే రాజధాని కారకాస్ వెలుపల ప్రభుత్వ సహాయక బృందాలు పెద్దగా కనిపించలేదని స్థానికులు తెలిపారు.
…………

































