పాకిస్థాన్‌లో ఉగ్రమూకల్ని అంతం చేసేందుకు భారత సైన్యం గత ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పెహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌లో ఆరుగురు భారతీయ సైనిక సిబ్బంది మృతిచెందినట్లు ప్రభుత్వం పేర్కొన్నది. ఆ ఆపరేషన్‌లో వీరమరణం పొందిన ఆ సైనికులు పేర్లను కూడా వెల్లడించారు. దేశ రాజధానిలో ఉన్న జాతీయ యుద్ధ స్మారకంపై ఆ ఆరుగురు సైనికుల పేర్లను చేర్చనున్నట్లు సైన్యం తెలిపింది. మిలిటరీకి చెందిన సుబేదార్ మేజర్ పవన్ కుమార్, రైఫిల్‌మాన్ సునిల్ కుమార్, లాన్స్ నాయక్ దినేశ్ కుమార్, అగ్నీవీర్ మురళీ నాయక్, హవిల్దార్ సునిల్ కుమార్ సింగ్‌తో పాటు భారతీయ వైమానిక దళానికి చెందిన సురేంద్ర కుమార్ ఉన్నారు.
ఆపరేషన్ సింధూర్‌లో ప్రాణాలు కోల్పోయిన ఆరుగురు వీర సైనికులతో పాటు 2025లో జరిగిన వివిధ మిలిటరీ ఆపరేషన్స్‌లో అమరులైన సైనికుల పేర్లను రిలీజ్ చేశారు. నేషనల్ వార్ మెమోరియల్‌లో ఉన్న త్యాగ చక్ర వద్ద ఆ ఆరుగురు సైనికుల పేర్లను రాయనున్నారు. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద క్యాంపులపై గత ఏడాది మే 7వ తేదీన భారతీయ సైనిక దళాలు అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్‌ను పాక్ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో డ్రోన్ దాడులు, షెల్లింగ్, వైమానిక అటాక్‌లు జరిగాయి. రెండు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు భీకర ఘర్షణ జరిగింది. ఆ తర్వాత మే 10వ తేదీన వార్ ముగిసింది.

































