వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంపై హోం మంత్రి అనిత స్పందించారు. వైసీపీ నేతలకు అమరావతిలో పర్యటించే నైతిక అర్హత లేదన్నారు. రైతులను పరామర్శించడానికి వెళ్లారా లేక రాజధానిలో రౌడీయిజం చేయటానికి వెళ్లారా అని ప్రశ్నించారు. మీరు వెళ్తే సమస్య వస్తుందని పోలీసులు ముందే చెప్పారు. మీరు వెళ్లిన పెనుమాకలో 90% రైతులు రాజధానికి భూములు ఇచ్చినవారే. రైతులపై రౌడీయిజం చేయడానికి గూండాలని వెంటబెట్టుకుని వెళ్లారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులే తప్పు చేసినట్టు ఇప్పుడు వైసీపీ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. వైసీపీ నేతల వెంట వెళ్లినవారిలో ఎంతమంది రౌడీషీటర్‌లు ఉన్నారో డిపార్ట్మెంట్ దగ్గర మొత్తం సమాచారం ఉందన్నారు. వైసీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తామన్నారు. అమరావతి ప్రజల కలల రాజధాని ఈరోజు శరవేగంగా ముందుకు వెళుతోందని అన్నారు.
2027 నాటికి అమరావతి పూర్తి కావాలని అందరం అహర్నిశలూ కష్టపడుతున్నామని వెల్లడించారు. ఆనాడు అమరావతి రాజధాని అని ఒప్పుకొని తర్వాత మూడు రాజధానుల డ్రామాలాడారని విమర్శించారు. మరలా ఇప్పుడు మావిగాన్ అంటూ ఏ ముఖం పెట్టుకొని రాజధానిలో పర్యటిస్తారని ప్రశ్నించారు. అమరావతి పూర్తయితే తమకి మనుగడ కూడా ఉండదని వైసీపీ ఈ డ్రామాలు చేస్తోందని మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకలతో చేసిన దాడే అని అన్నారు. జరిగిన ఘటనపై అధికారులను అడిగి సమాచారం
తెలుసుకున్నట్లు తెలిపారు. అమరావతి రైతులు కడుపు మంటతో ఉన్నారన్నారు.

































