వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు. మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవని డిజిటల్ నెర్వ్ సెంటర్‌ను సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికీ తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, ఏటా రైతులకు రూ.20 వేలు ఇస్తున్నామని చెప్పారు. మనసున్న ప్రభుత్వం కాబట్టే ప్రజలకు అన్నీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగాయని, ప్రైవేటు స్కూళ్ల నుంచి లక్ష మంది ప్రభుత్వ బడుల్లో చేరారని తెలిపారు.
ఏపీకి పోలవరం జీవనాడి అని తెలిపారు. వైసీపీ హయాంలో పోలవరాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. పనులు పూర్తికాకుండానే వెలిగొండను జాతికి అంకితం చేశారన్నారు. మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసే పరిస్థితి తీసుకొస్తామన్నారు. అమరావతిని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతామని అన్నారు. నదుల అనసంధానం తన జీవిత లక్ష్యమని స్పష్టం చేశారు. నీటి సమస్యలను అన్ని రాష్ట్రాలు పరిష్కరించుకోవాలని సూచించారు. నదుల అనుసంధానమే అన్ని రాష్ట్రాలకు శ్రీరామ రక్ష అని తెలిపారు.

































