రాష్ట్ర జలహక్కులపై సిఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణభవన్ లో హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ట్రిబ్యునల్, అపెక్స్ లేకుండానే దొడ్డి దారిన ఒప్పందాలు జరిగాయని అన్నారు. మన జలహక్కులకు ప్రమాదమని తెలిసినా రేవంత్ వత్తాసు పలుకుతున్నారని, ఎపి, కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల కోసం తెలంగాణ జలహక్కుల తాకట్టు సర్కార్ కుట్రని విమర్శించారు. తుంగభద్ర డ్యామ్ నూతన గేట్ల ప్రారంభోత్సవంలో రేవంత్ రహస్య ఒప్పందం అని జలహక్కుల పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని ప్రశ్నించారు. జల హక్కులను కాపాడేందుకు బిఆర్ఎస్ నిరంతర పోరాటం చేస్తుందని, మాజీ సిఎం హెచ్చరికలతో నాడు గుండ్రేవులకు బ్రేకులు పడ్డాయని, ముగ్గురు సిఎంలు కలిసి ఒప్పందం చేసుకున్నామని అంటున్నారని తెలిపారు.
ముగ్గురు సిఎంల రహస్య ఒప్పందాలను బయట పెట్టండని, గుండ్రేవుల రిజర్వాయర్ పూర్తయితే తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రాజెక్టులకు రేవంత్ అభ్యంతరం ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. రేవంత్ అవగాహన రాహిత్యంతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టమని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వానికి కర్ణాటక లేఖ రాసిందని, ఏం ఒప్పందం జరిగిందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టుకైనా అనుమతిచ్చావా? అని ప్రశ్నించారు. ప్రతిసారి డిపిఆర్ ఎందుకు వాపస్ వస్తుందని, తమ గురువు కోసం ఏం చెప్పుకున్నావో ప్రజలకు తెలియాలని, చంద్రబాబు నాయుడు ఏం చెబితే కేంద్రంలో అదే జరుగుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు పలుకుబడితో ఎపి వ్యక్తిని కేంద్ర ఇరిగేషన్ అధికారిగా నియమించారని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

































