విక్టరీ వెంకటేష్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ఆదర్శ కుటుంబం (హౌస్ నెం.47) విడుదల తేదీ అధికారికంగా ఖరారైంది. వెంకటేష్ కెరీర్లో 77వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను గాంధీ జయంతి సందర్భంగా, అక్టోబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు), వంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రఖ్యాత ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మొదటి పూర్తి స్థాయి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

































