హీరో సూర్య అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది. హోంబలే ఫిలింస్ తమ తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. సూర్య హీరోగా, దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రం రూపొందనుండటం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని రోజులుగా సూర్య-జ్ఞానవేల్ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్తలు వినిపించినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను హోంబలే ఫిలింస్ నిర్మించనుండటం మాత్రం అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌గా మారింది. భారీ నిర్మాణ విలువలకు పేరుగాంచిన ఈ సంస్థతో సూర్య తొలిసారి చేతులు కలపడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఈ సందర్భంగా హోంబలే ఫిలింస్ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఫ్రేమ్ బై ఫ్రేమ్, సినిమా బై సినిమా, పోరాటం బై పోరాటం తనకంటూ ఓ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటుడు. నిజాయితీతో కూడిన పాత్రలు, జీవితాలను ప్రతిబింబించే కథలు, ధైర్యం మరియు నమ్మకంతో సాగిన మూడు దశాబ్దాల అద్భుత ప్రయాణం. ఈ తరం అత్యంత సాహసోపేతమైన నటుడు ఇప్పుడు తన కెరీర్‌లోనే అతిపెద్ద వేదికపైకి అడుగుపెడుతున్నారు అంటూ సూర్య సినీ ప్రయాణాన్ని సంస్థ కొనియాడింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు టెక్నికల్ టీమ్ కూడా భారీగానే సిద్ధమైంది. విజయ్ కిరగందూర్, చలువే గౌడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సూర్య సరసన కాయదు లోహర్ హీరోయిన్‌గా నటించనున్నారు. సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ పనిచేస్తుండగా, ఎస్.ఆర్. కతీర్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ఫిలోమిన్ రాజ్ చేపట్టనున్నారు.

































