భారతీయ సినిమాను ప్రపంచ వేదికపై నిలబెట్టిన దర్శకుల్లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఆయన రూపొందించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు సాధించడమే కాకుండా, తెలుగు సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో కొత్త గుర్తింపును తీసుకొచ్చింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్ చిత్రం వారణాసి ప్రీ-ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న రాజమౌళి ఖాతాలో తాజాగా మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం చేరింది.
ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న రాజమౌళిని అక్కడి ప్రముఖ సినీ సంస్థ సినెమాథెక్ ఫ్రాన్సైస్ ఘనంగా సత్కరించింది. పారిస్ నగరంలోని చారిత్రక హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో ఆయన పేరిట శాశ్వత సీటును ఏర్పాటు చేయడం విశేషంగా మారింది. ప్రపంచ సినీ చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థలో చోటు దక్కడం ప్రతి దర్శకుడికీ అరుదైన గౌరవంగా భావిస్తారు. ఫ్రెంచ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కోస్టా గావ్రాస్ సమక్షంలో ఈ గౌరవాన్ని రాజమౌళికి అందించారు. అదేవిధంగా రాజమౌళి తెరకెక్కించిన పలు చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించడం కూడా కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
తనకు లభించిన ఈ అరుదైన గౌరవంపై రాజమౌళి స్పందించారు. పారిస్లో తన సినిమాలను ప్రదర్శించడమే గొప్ప గౌరవమని భావించానని, కానీ హెన్రీ లాంగ్లోయిస్ హాల్లో తన పేరిట శాశ్వత సీటు ఏర్పాటు చేయడం జీవితంలో ఊహించని సంఘటనగా అభివర్ణించారు. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను. ప్రపంచ సినీ చరిత్రలో ఎంతో ప్రాధాన్యం కలిగిన ఈ సంస్థలో నాకు చోటు దక్కడం జీవితాంతం గుర్తుండిపోతుంది అని ఆయన పేర్కొన్నారు. భారతీయ సినిమాపై ప్రత్యేక గౌరవం చూపిన కోస్టా గావ్రాస్తో పాటు సినెమాథెక్ ఫ్రాన్సైస్ బృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

































