రాజకీయాల్లోకి వచ్చాక తన భవిష్యత్తుపై గందరగోళంలో పడ్డానని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలిపారు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ వీబీఐటీ క్యాంపస్ లో వికసిత్ భారత్ స్టూడెంట్స్ కాంక్లెవ్‌లో నితిన్ నబీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిన్నవయసులోనే అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. ఏ పని చేసినా తనదైన ముద్ర ఉండాలని గట్టిగా అనుకున్నానని, జీవితం వందమీటర్ల పరుగుపందెం కాదని, మన ఓపికకు పరీక్షని తెలియజేశారు. అప్పగించిన పనిని నిబద్ధతతో పూర్తి చేయడమే తన బలం అని వేగంగా లక్ష్యాలు చేరాలనే ఆరాటంలో నేటి యువత ఉందని నితిన్ నబీన్ పేర్కొన్నారు. ఏ పనినైనా, ఓపిక, నిలకడ,శక్తితో చేసినప్పుడే ఫలితాలు వస్తాయని, నేటి యువత ఎప్పుడూ వాస్తవికత గుర్తించి పనిచేయాలని సూచించారు. రీల్స్, షార్ట్స్ చూసి ఎవరూ నిర్ణయాలు తీసుకోవద్దు అని జీవితంలో నిర్ణయం తీసుకునేందుకు సమయం తీసుకోండని సూచించారు. వాస్తవికత ఆధారంగా నిర్ణయాలు తీసుకోండని, పని మొదలుపెట్టండని, యువత..రాజకీయాల్లోకి రావాలని, వచ్చాక ఏం చేస్తారో స్పష్టత ఉండాలని అన్నారు. గతంలో తమ హక్కుల గురించి ప్రజలకు అంతగా తెలిసేది కాదని, సోషల్ మీడియా వచ్చాక ప్రజల్లో చైతన్యం పెరిగిందని చెప్పారు. హక్కుల, విధుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, పార్టీలు, నాయకులు ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తుంచుకుంటారని స్పష్టం చేశారు.

































