చైనా బిలియనీర్ గువో వెంగుయికి 30 ఏళ్ల జైలుశిక్ష పడింది. అమెరికాలోని మన్‌హటన్ జిల్లా కోర్టు ఆయనకు ఆ శిక్షను విధించింది. జిల్లా జడ్జీ అనాలిసా టోరిస్ ఆ తీర్పును వెలువరించారు. చైనాలో ఒకప్పుడు సంపన్న వ్యక్తిగా ఉన్న గువో వెంగుయి, కొన్నేళ్ల క్రితం అమెరికాకు పరారీ అయ్యారు. అయితే అమెరికా వేదికగా చైనా కమ్యూనిస్టు పార్టీని ఆయన విమర్శించేవారు. బిలియన్ డాలర్ల స్కామ్‌లో అమెరికా కోర్టు ఆయనకు ఇవాళ శిక్షను ఖరారు చేసింది. ప్రాపర్టీ టైకూన్‌గా పేరున్న గువో వెంగుయి, 2017లో చైనాను వీడి అమెరికా వెళ్లారు. అక్కడ కమ్యూనిస్టు పార్టీ విమర్శకుడిగా పేరుగాంచారు. ఆన్‌లైన్‌లో భారీ సంఖ్యలో చైనీయులు ఆయన్ను ఫాలో అయ్యేవారు. అయితే మనీల్యాండరింగ్, ఫ్రాడ్, ముఠా నేరాభియోగాల కింద గువోను అరెస్టు చేశారు.
చైనాకు ప్రజాస్వామ్యాన్ని మార్చాలనుకున్న ప్రజలను గువో పీక్కుతిన్నారని న్యూయార్క్ కోర్టు జడ్జీ అనాలిసా తన తీర్పులో పేర్కొన్నారు. చైనీయుల నుంచి ఆన్‌లైన్ ద్వారా డబ్బును దోచుకున్న గువో ఆ సొమ్ముతో సంపన్న జీవితాన్ని గడిపారు. చైనాలో రాజకీయ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని భారీ ఆన్‌లైన్ ఉద్యమాన్ని నడిపారు. అమెరికా చేరుకున్న తర్వాత వారి నుంచి భారీ మొత్తంలో సొమ్మును రాబట్టారు. అమెరికాలో ఉన్న చైనా కమ్యూనిటీ ప్రజల్ని నమ్మించారు. తన ఫాలోవర్ల నుంచి సుమారు బిలియన్ డాలర్ల మొత్తాన్ని సేకరించారు. 2018 నుంచి 2023 మధ్య కాలంలో ఇన్వెస్ట్‌మెంట్, క్రిప్టో స్కీమ్‌లతో ప్రజల్ని గువో మోసం చేశారు.

































