ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎంసిఆర్ హెచ్ఆర్డి లోని బోధి పెవిలియన్‌లో ఇరువురు సమావేశమైయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు. తెలంగాణలో అమలవుతున్న ప్రగతిశీల పాలన, పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలు మరియు రాష్ట్రానికి దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానాలలో ఒకటిగా గుర్తింపు తెచ్చిన కీలక సంస్కరణల గురించి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వివరించారు.
యువతకు పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాలను అందించే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పారిశ్రామిక శిక్షణా సంస్థలను (ఐటీఐలను) ప్రపంచ స్థాయి అధునాతన సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీలుగా) ఉన్నతీకరించడం, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ కళాశాలలను ఆధునీకరించడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించారు. డిజిటల్ మౌలిక సదుపాయాలకు ప్రపంచ కేంద్రంగా నిలవాలన్న తెలంగాణ దార్శనికతను నొక్కిచెబుతూ, చందన్వెల్లి డేటా సెంటర్ ప్రాజెక్ట్ అమలును వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ను కోరారు. రాష్ట్రంలో ఒక భారీ సమీకృత డేటా సెంటర్, ఏఐ మౌలిక సదుపాయాల క్యాంపస్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని కూడా ఆయన ఆ కంపెనీని ఆహ్వానించారు.

































