తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు డా. బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కే రామకృష్ణా రావు (ఐఏఎస్) పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం జూన్ 26న ఉత్తర్వులు జారీ చేసిందని తెలిసిందే.
ఈ ఉత్తర్వుల మేరకు సంజయ్ జాజు నేడు నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, వివిధ శాఖల విభాగాధిపతులు, సచివాలయ అధికారులు, సిబ్బంది సంజయ్ జాజుతోపాటు కే. రామకృష్ణా రావును పుష్పగుచ్ఛాలతో అభినందించారు.
2029 ఫిబ్రవరి వరకూ సంజయ్ జాజు ఈ పదవిలో కొనసాగనున్నారు. సంజయ్ జాజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. హైదరాబాద్, విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్‌గా, ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అదేవిధంగా రెండు తెలుగురాష్ట్రాలలో ఎంతో ప్రాముఖ్యత చెందిన మీ సేవ రూపకర్తలలో ఆయన ఒకరు. ఈ ప్రాజెక్టు రూపకల్పన, అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.

































