కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలో మూడురోజులు పర్యటించారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు మీడియాతో ప్రసంగించారు. జొన్నగిరిలో గోల్డ్ ఫీల్డ్స్‌ను ప్రారంభించామని, కుప్పంలో కూడా బంగారు గనులు ఉన్నాయని చెబుతున్న నేపథ్యంలో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయని అన్నారు. రాయలసీమ పెద్దఎత్తున ప్రాజెక్టులు చేపట్టామని, అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తున్నానని, ఫలితాలు అధ్యయనం చేస్తున్నానని తెలియజేశారు. ఇతర ప్రాంతం నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం రావాలని, కుప్పం నుంచి మరోసారి ప్రాంతానికి వెళ్లే పరిస్థితులు రాకూడదని సూచించారు. రూ.9,320 కోట్లతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని త్వరలోనే కుప్పానికి గండికోట నుండి తాగునీరు ఇంటింటికి అందిస్తామని, కుప్పం నియోజకవర్గం, మోడల్, ఆదర్శ నియోజకవర్గం అని పేర్కొన్నారు.
కుప్పం నియోజకవర్గంలో 80 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని, వందల మంది పౌల్ట్రీ రైతులకు చేయూతనిస్తామని అన్నారు. నియోజకవర్గం నుంచి పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు నాంది పలుకుతారని, అడిడాస్ పరిశ్రమ ద్వారా 20 వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. డెయిరీ, పుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు వచ్చాయని, మైక్రో ఇరిగేషన్ రాష్ట్రానికి శ్రీరామ రక్షగా మారిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. 10 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి స్థాయికి కుప్పం చేరుతుందని, డ్వాక్రా సంఘాల ద్వారా గడ్డి పెంచి కమ్యూనిటీ ఫోరమ్ ల ద్వారా సరఫరా కుప్పం నియోజకవర్గం అగ్రికల్చర్ హబ్ గా తయారు కావాలని కోరారు. వాణిజ్య, కూరగాయ పంటల ద్వారా మంచి ఆదాయం వస్తుందని, కుప్పం నియోజకవర్గం ఆర్టికల్చర్ హబ్ గా తయారు కావాలని ఆశిస్తున్నారు.

































